గ్యాస్ లేకుండానే రోజూ 2 లక్షల పిల్లలకు భోజనం… బెంగళూరులో అద్భుత కిచెన్
➖➖➖✍️ 👏🍽️
దేశంలో వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు, హాస్టళ్లు ఇబ్బందులు పడుతున్నాయి. కానీ బెంగళూరులో ఒక కిచెన్ మాత్రం ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా వాడకుండా వేల మందికి భోజనం వండి అందిస్తోంది.
బెంగళూరుకు చెందిన డా. తేజస్విని అనంత్‌కుమార్ సారథ్యంలో నడుస్తున్న ‘అదమ్య చేతన’ అనే ఎన్జీఓ నిర్వహిస్తున్న అన్నపూర్ణ సెంట్రల్ కిచెన్ గత 18 ఏళ్లుగా పునరుత్పాదక ఇంధనంతోనే పనిచేస్తోంది.
ఈ కిచెన్ ద్వారా రోజూ సుమారు 2 లక్షల మంది స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అలాగే వేల మందికి అన్నదానం కూడా చేస్తున్నారు.
ఈ కిచెన్‌లో గ్యాస్ సిలిండర్లకు బదులుగా బయోమాస్, వ్యవసాయ వ్యర్థాలు ఉపయోగిస్తున్నారు. ధాన్యపు పొట్టు, గడ్డి, కొబ్బరి చిప్పలు వంటి వ్యవసాయ అవశేషాలతో తయారైన బ్రికెట్లను ఉపయోగించి పెద్ద పెద్ద బాయిలర్లలో టన్నుల కొద్దీ బియ్యాన్ని ఆవిరిపై ఉడికిస్తున్నారు.
విద్యుత్‌కు బదులుగా సౌరశక్తిని వినియోగిస్తున్నారు. కిచెన్‌లో వాడిన నీటిని రీసైకిల్ చేసి మొక్కలకు ఉపయోగిస్తారు. బాయిలర్ శుభ్రం చేసిన నీటిని ఫిల్టర్ చేసి వాహనాలు కడగడానికి వాడుతున్నారు.
ఈ విధంగా ఈ కిచెన్ ఇప్పటికే జీరో గార్బేజ్ యూనిట్గా గుర్తింపు పొందింది. మొత్తం బయో ఇంధనం వాడటం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 12,500 గ్యాస్ సిలిండర్లను ఆదా చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ జ్ఞాపకార్థంగా 1997లో ప్రారంభమైన ‘అదమ్య చేతన’ సంస్థ ఇప్పుడు మహిళల సాధికారత, ఆరోగ్య అవగాహన, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది.
స్వీయ ఇంధనంతో స్వావలంబన సాధించిన ఈ కిచెన్ నిజంగా అందరికీ స్ఫూర్తి.