POLITICAL NEWS

అధ్వానంగా మారిన రోడ్లపై పాదయాత్ర.. ధర్నా నిర్వహించిన Narayankhed మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

By P. JAIPAL REDDY • 2026-10-07 06:18 • 21 views   Share WhatsApp Share Facebook Share X
అధ్వానంగా మారిన రోడ్లపై పాదయాత్ర.. ధర్నా నిర్వహించిన Narayankhed మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నాగల్‌గిద్ద మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రోడ్లను వెంటనే నిర్మించాలని, రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కారముంగి నుంచి కారస్‌గుత్తి వరకు మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాదయాత్ర, ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించి రైతుల పంటలను కాపాడాలని అధికారులను డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ..

“నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజల అవసరాలను గుర్తించి నారాయణఖేడ్ నుండి డబుల్ లైన్ రోడ్ను ఏర్పాటు చేశాను, అనేక రోడ్లను శాంక్షన్ చేయించాను.
ఈ మండలంలో నాలుగు కొత్త చెరువులను మంజూరు చేయించాను.
నేను గతంలో శాంక్షన్ చేయించిన రోడ్లను కాంగ్రెస్ నాయకులు డబ్బులు కాజేసి వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్లను పూర్తి చేయలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. కనీసం ఇప్పటికే ఉన్న రోడ్లపై ఏర్పడిన గుంతలను కూడా పూడ్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రజలు, రైతులు నిత్యం ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.”

“ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. శాంక్షన్ అయిన రోడ్లను పూర్తి చేయకుండా, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మూడేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గంలో కనీస మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని?” అని ప్రశ్నించారు.

అలాగే రైతులకు విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని భూపాల్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. “రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్నారు. కానీ సరైన సమయంలో కరెంటు అందక పంటలు ఎండిపోతుంటే రైతుల బాధను పట్టించుకునే నాథుడే లేడు. రైతుల పంటలు కళ్లముందే ఎండిపోతుంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని?” అని ప్రశ్నించారు.

“రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతులను కరెంటు కోసం సబ్‌స్టేషన్ల చుట్టూ తిప్పుతోందని ఆయన విమర్శించారు. ఒకవైపు రోడ్లు లేవు.. మరోవైపు కరెంటు లేదు.. పంటలు ఎండిపోతున్నాయి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవిలో ఉండి ప్రజలకు ఏం ప్రయోజనమని?” అని భూపాల్ రెడ్డి గారు ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై పోరాడటానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

శాంక్షన్ చేయించిన రోడ్లను పూర్తి చేయడం చేతకాకపోతే.. కనీసం ప్రజల కష్టాలు తెలుసుకుని పనులు చేయించండి. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించి వారి పంటలను కాపాడండి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మూల్యం చెల్లించుకోక తప్పదని భూపాల్ రెడ్డి గారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

P. JAIPAL REDDY 0 followers