National

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్- ప్రపంచ హృదయ(గుండె) దినోత్సవ అవగాహన కార్యక్రమము..........

By NANDURI VENKATESWARLU • 2026-09-29 14:12 • 13 views   Share WhatsApp Share Facebook Share X
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్- ప్రపంచ హృదయ(గుండె) దినోత్సవ అవగాహన కార్యక్రమము..........

తేదీ: 29-09-2026:శేర్లింగంపల్లి:ఈరోజు ఉదయము మాదాపూర్ డివిజన్ పరిధిలో గల గోకుల్ ప్లాట్స్ నందు గల డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ కార్యాలయ ఆవరణలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ(గుండె) దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని చందానగర్ లో గల ఓమెగా/PRK హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ భానుకిరణ్ రెడ్డి, (కార్డియాలజిస్ట్) హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ " *పర్యావరణంలో వచ్చే పెను మార్పులతో, మారిన జీవనశైలితో మానవుడు గుండె జబ్బులతో సతమవుతున్నాడు. గుండె జబ్బులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీనితో ప్రాణనష్టం, ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయి. నష్ట నివారణకై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారు సంయుక్తంగా 2011వ సంవత్సరము సెప్టెంబర్ 29 నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం ' _డోంట్ మిస్ ఎ బీట్_ '. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, గుండెజబ్బుల వలన జరిగే అనర్థాలను, వ్యాధి లక్షణాలను మరియు నివారణపై అవగాహన కల్పించడమే"* అని అన్నారు. " *పిడికెడు గుండె మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది"* అని అన్నారు. " *గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవము. యిది శరీరంలో ఛాతి, ఊపిరితిత్తుల మధ్య వుంటుంది. గుండె ఆక్సిజన్ పోషకాలను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది"* అని అన్నారు. " *మారిన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన వయసు మరియు లింగభేదము లేకుండ ఎక్కువమంది గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. గుండెలోని రక్త నాళాలలోని బ్లాకుల (పూడికలు) వలన రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడి రక్తాన్ని గుండె సరఫరా చేయలేకపోతుంది. దీని ఫలితంగా (హార్ట్ ఎటాక్) గుండె పోటు వస్తుంది. వ్యాధి రావడానికి గల కారణాలు. మధుమేహము, బీ. పీ., అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, వత్తిడి ఎక్కువగా ఉండటం, ధూమపానం మరియు మద్యపానము సేవించడం వలన, అధిక కొవ్వు కలిగిన పదార్థాలతో పాటు మరియు మైదాతో తయారుచేసిన పదార్థాలు తీసుకోవడం వలన గుండెపోటు వస్తుంది"* అని అన్నారు.
*వ్యాధి లక్షణాలు:*
* *ఛాతిలో ఆకస్మికముగా నొప్పి రావడం, అది మెడ వరకు ప్రాకడం, ఆకస్మిక మైకం మరియు వికారం, శరీరమంతా చెమటలు పట్టి చల్లగా అయిపోయి యిబ్బంది పడటం, ఛాతిలో నొప్పి ప్రారంభమయి ఎడమ చేయి, ఎడమ దవడ మరియు కుడి చేయివరకు యీ నొప్పి వ్యాపిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది"* అని తెలియజేశారు.
* *"ఆరోగ్యమే మహాభాగ్యము కావున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల లోనే ఉంటుంది* .
* *నివారణ చర్యలు:*
* *మధుమేహం మరియు కొలెస్ట్రాల్ ను నియంత్రణలో పెట్టుకోవాలి.*
* *ధూమపానం మానేయాలి.*
* *శారీరక శ్రమ, వ్యాయామం, ధ్యానం, ప్రాణయామం, నడక వంటివి కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు మరియు క్యాలరీలు అధికంగా వున్న ఆహార పదార్థాలను తీసుకోవడం మానేయాలి. అలాగే రెడ్ మీట్ ను కూడా పూర్తిగా మానేయాలి.*
* *వంట నూనెలు తక్కువగా వాడాలి.*
* *తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మొలకలు, తృణధాన్యాలు, చేపలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు వాడాలి.*
* *ప్రతిరోజు కనీసం 6 నుండి 7 గంటలు గాఢ నిద్ర పోవాలి.*
*ఈ విధమైన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి"* అని తెలియజేశారు.
" *సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే 2D Echo పరీక్షలు కూడా చేయించుకోవాలి* " అని తెలిపారు. " *గుండెపోటు వచ్చినపుడు _ఆస్పరిన్_ ట్యాబ్లెట్ ను చప్పరించాలి. అవకాశం ఉన్న అన్ని సందర్భాలలో యిటువంటి అవగాహన కార్యక్రమాలలో పాల్గొని వ్యాధుల పట్ల అవగాహన పెంచుకొని వైద్యుల సూచనలు, సలహాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి* " అని తెలిపారు.
ఈ సందర్భంగా బి. పీ., షుగర్, 2డీ ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ నిర్వాహకురాలు చావ అరుణ మరియు సిబ్బంది, మహిళలు, కాలనీ వాసులతో పాటు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామిరెడ్డి, బాలాజీ అలాగే హాస్పిటల్ ప్రతినిధులు జాకీర్ హుసేన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

##latestnews
NANDURI VENKATESWARLU 0 followers