డ్రగ్స్ తో జీవితం మసి, వాటిని మానేస్తే జీవితం ఖుషి. రాచకొండ ప్రభాకర్.
సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రధాన కూరగాయల మార్కెట్ ఆవరణలో డ్రగ్స్, గంజాయి నిర్మూలన మరియు రహదారి భద్రతపై ఒక వినూత్న అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అత్యంత ప్రభావవంతంగా నిర్వహించడం జరిగింది. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామ జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులు, సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ విచిత్ర వేషధారణ ధరించి వచ్చి మార్కెట్‌కు వచ్చిన ప్రజలను, కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుని ఆలోచింపజేశారు.
ఈ సందర్భంగా ఆయన మైక్ ద్వారా మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలు, ధూమపానం, గుట్కా, పొగాకు ఉత్పత్తుల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. వీటి దురలవాట్ల వల్ల కలిగే తీవ్ర శారీరక, మానసిక వ్యాధులు, భారీ ఆర్థిక నష్టాల గురించి విడమరిచి చెప్పారు. డ్రగ్స్‌కు బానిసలైతే విలువైన కుటుంబాలు, మానవ జీవితాలు సర్వనాశనమవుతాయని హెచ్చరించారు. యువత స్పష్టమైన సమున్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని, క్రమశిక్షణతో కష్టపడి గొప్ప విజయం సాధించాలని, తల్లిదండ్రులకు, గురువులకు ఉత్తమ పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అలాగే ప్రయాణాల్లో ప్రతి పౌరుడూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని గట్టిగా కోరారు. ద్విచక్ర వాహనదారులు ప్రాణరక్షణ కోసం విధిగా హెల్మెట్, కార్లు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. "నో డ్రగ్స్ - సేవ్ లైఫ్" నినాదాలతో కూడిన కరపత్రాలు పంచుతూ, మైక్ సెట్, పెద్ద ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేశారు. మరుగున పడుతున్న సాంప్రదాయ జానపద కళలను కాపాడుతూ ఈ ప్రదర్శన జరపడం సమాజానికి ఎంతో ఆదర్శనీయం.