నూతన సంవత్సర వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైంది. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకల వేళ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈగల్ టీమ్ కఠిన చర్యలకు సిద్ధమైంది. డిసెంబరు 31వ తేదీ రాత్రి నగరవ్యాప్తంగా ముమ్మరంగా డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నట్టు ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ రావుల వెల్లడించారు.
రంగంలోకి 12 ప్రత్యేక బృందాలు: ఎస్పీ గిరిధర్
యువత పెడదారిన పడకుండా, వేడుకలు ప్రశాంతంగా జరుపుకునేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడం కోసం 150 మంది సభ్యులతో కూడిన 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పబ్ లు, క్లబ్ లు, రిసార్ట్ లు, శివార్లలో ఉన్న ఫామ్ హౌస్ ల పైన ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్టు పేర్కొన్నారు.
డ్రగ్స్ వాడినా, సరఫరా చేసినా కఠిన చర్యలు
ఎక్కడ అనుమానం వచ్చినా వెంటనే తనిఖీలు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన యాంటీ నార్కోటిక్ బ్యూరో ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ రావుల ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తూ, లేదా సరఫరా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
పబ్స్ లో వారిపైనే నజర్
ఈ సంవత్సరం తనిఖీలలో ప్రధాన దృష్టి డీజే ఆపరేటర్లపై ఉండా dj నిర్వాహకులపై ఈసారి టెస్ట్ లు ప్రారంభిస్తున్నట్టు ఈగల్ టీం ఎస్పీ తెలిపారు. పబ్ లలో తనిఖీలు ప్రారంభించగానే డీజే ఆపరేటర్లకు డ్రగ్ టెస్ట్ చేస్తామని ఇతర సిబ్బందికి అనుమానిత వ్యక్తులకు పరీక్షలు నిర్వహిస్తామని, డ్రగ్ సరఫరాలో కానీ వినియోగంలో కానీ డీజేల పాత్ర ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫామ్ హౌస్ పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే యజమానుల పైన కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తనిఖీలలో సలైవా డ్రగ్ టెస్ట్ కిట్లు..
దొరికితే కటకటాలే ఈసారి తనిఖీలలో డ్రగ్స్ టెస్ట్ కిట్లను ఉపయోగిస్తున్నట్లు, సలైవా డ్రగ్ టెస్ట్ తో కేవలం కొద్ది నిమిషాలలోనే వ్యక్తి డ్రగ్ తీసుకున్నారో లేదో నిర్ధారణ అవుతుందని ఎస్పీ గిరిధర్ తెలిపారు ఒకవేళ పరీక్షలో పాజిటివ్ అని తేలితే సదరు వ్యక్తిపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. న్యూ ఇయర్ పార్టీస్ లో డ్రగ్స్ వాడితే కటకటాలు లెక్క పెట్టాల్సిందేనని సాలిడ్ వార్నింగ్ ఇచ్చారు.
