వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలు ఆరంభం అయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:05 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ఈ-డిప్ ద్వారా టికెట్లను పొందిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులు, విజిలెన్స్ యంత్రాంగం సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంది. శిలాతోరణం, కృష్ణతేజ విశ్రాంతి గృహాల వద్ద సర్వదర్శనం టోకెన్ల తనిఖీ కేంద్రంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తనిఖీ సైతం నిర్వహించారు. టోకెన్ల జారీ సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండటానికి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ పరిణామాల మధ్య 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవంతో ఇవి ఆరంభమౌతాయి. 25వ తేదీన రథసప్తమితో ముగుస్తాయి. మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం, కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు, పురందరదాసుల ఆరాధన మహోత్సవం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు. 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది టీటీడీ. 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేస్తారు. 14న భోగి, 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం, 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు వంటి విశేష ఉత్సవాలు ఉంటాయి. 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం, 23న వసంత పంచమి, 25న రథ సప్తమి వేడుకలు జరుపుతారు.
