హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేళ క్యాబ్, ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ క్యాబ్, ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ కు రావడానికి నో చెప్పినా.. న్యూ ఇయర్ నేపథ్యంలో బుకింగ్ ధర పెంచి.. పలు కారణాలు చెప్పి అధికంగా డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై మోటార్ వెహికిల్ చట్టంలోని పలు సెక్షన్ ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తమను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ వివరాలను పోస్టు చేశారు.
“న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే మాకు తెలియజేయండి: వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్ షాట్.. హైదరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 91 94906 16555 కు పంపించండి” అని సజ్జనార్ తన ఖాతాలో పోస్టు చేశారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో.. ఇటీవల వీసీ సజ్జనార్ మరో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి.. ‘మా డాడీ ఎవరో తెలుసా..?’, ‘మా అంకుల్ ఎవరో తెలుసా..?’ ‘అన్న ఎవరో తెలుసా..?’.. అని తమ అధికారులను అడగొద్దని ఈ మేరకు సీపీ సజ్జనార్ సూచించారు. ఇలా చెప్పడం వల్ల ఏమీ జరగదని స్పష్టం చేశారు. తాము ప్రజల ప్రైవసీను గౌరవిస్తామని తెలిపారు. అలాంటి సమయంలో వాహనం పక్కకు పెట్టి మళ్లీ కోర్టులో డేట్ వచ్చినప్పుడు కలుస్తామని సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వీసీ సజ్జనార్ వెల్లడించారు.
