వేసవి సెలవుల్లో ఊరికి వెళ్తున్నారా… జరభద్రం! – సంగారెడ్డి జిల్లా పోలీసులు. • వేసవి కాలంలో చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. • రానున్న 2–3 రోజులలో ఎండ తీవ్రత అధికం – జాగ్రత్తలు పాటించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.
జిల్లా పోలీసు కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, 20.04.2026.
• వేసవి సెలవుల్లో ఊరికి వెళ్తున్నారా… జరభద్రం! – సంగారెడ్డి జిల్లా పోలీసులు.
• వేసవి కాలంలో చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
• రానున్న 2–3 రోజులలో ఎండ తీవ్రత అధికం – జాగ్రత్తలు పాటించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.
సంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 20: వేసవి సెలవుల దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో చాలామంది తమ సొంత గ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందున, ఊరికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. వేసవి సెలవుల్లో పిల్లలు చెరువులు, కుంటలు వంటి లోతట్టు ప్రాంతాలకు ఈతకు వెళ్లే సందర్భంలో లోతైన ప్రాంతాలు, తెలియని ప్రదేశాలు ప్రమాదకరమని, తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. రానున్న రెండు నుంచి మూడు రోజులలో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకూడదని అన్నారు.
*వేసవి కాలంలో పాటించవలసిన జాగ్రత్తలు – జిల్లా పోలీసుల సూచనలు:*
• ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే బ్యాంక్ లాకర్లలో భద్రపరచడం మంచిది.
• ఊరికి వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి.
• ద్విచక్ర వాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలి; రోడ్డుపై నిలపరాదు.
• విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు.
• బయట పార్క్ చేసే వాహనాలకు హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ కూడా వేయాలి.
• ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
• సీసీ కెమెరాలను ఇంటర్నెట్‌కు అనుసంధానం చేస్తే మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా ఇంటిని పర్యవేక్షించవచ్చు.
• తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు ప్రజలు సహకరించాలి. సమీప పోలీస్ స్టేషన్ అధికారులు, ఇతర అధికారుల ఫోన్ నంబర్లు సెల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.
• అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల గురించి డయల్ 100 లేదా సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలి.
• సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు సమీప పోలీస్ స్టేషన్‌లో మీ వివరాలు నమోదు చేయడం మంచిది.
• ప్రయాణాల్లో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలి.
• చెరువులు, కుంటలలో ఈతకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి; తెలియని ప్రదేశాల్లో ఈతకు వెళ్లకపోవడం మంచిది.
• ఎండ తీవ్రత అధికంగా ఉండే మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం.