ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు* *ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు
ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు;
ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు
జగిత్యాల మే25:
జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్ మరియు వాటర్ ఫ్లాస్క్స్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు మరియు జాతీయ రహదారుల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా కలిగే డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, అలసట వంటి ఆరోగ్య సమస్యల నుండి సిబ్బందిని రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లపై వాహన రాకపోకలను క్రమబద్ధీకరించడం మాత్రమే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణలో కూడా వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అలాంటి సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం పోలీస్ శాఖ బాధ్యత అని అన్నారు.అలాగే విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది తరచూ నీరు తాగుతూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. అవసరమైతే కొద్దిసేపు నీడలో విశ్రాంతి తీసుకోవాలని, ఎండ తీవ్రతను నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. ప్రజల సేవలో ముందుండే పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలరని పేర్కొన్నారు.జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని, భవిష్యత్తులో కూడా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతాయని ఎస్పీ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్ ఐపీఎస్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేశం, సుప్రియ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ట్రాఫిక్ సిబ్బంది జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.