సమష్టిగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేద్దాము

* గిరి ప్రదక్షిణ మార్గం సాకారం కావాలి 

* మీరు పనులు మొదలుపెడితే స్వయంగా వచ్చి కరసేవ చేస్తా

* ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిన టీటీడీకి ధన్యవాదాలు

* కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 

“ఆంజనేయస్వామి అందరి దేవుడు, విశ్వాంతర్యామి. ఆయన ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు. మా ఇలవేల్పు ఆంజనేయ స్వామి వారికి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సాకారం చేద్దాం. అందరూ పూనుకొని స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దాం” అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రామభక్తులు అనుకుంటే కానిదంటూ ఏదీ ఉండదని, త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానని చెప్పారు. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉందన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ.35.19 కోట్లతో వసతి సముదాయం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం శంకుస్థాపనలు చేశారు. 2024 ఎన్నికల ముందు వారాహి యాత్ర ప్రారంభ సమయంలో కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి దర్శనానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినపుడు ఆలయంలో వసతి సముదాయం, దీక్షా మండపం అవసరాన్ని ఆలయ అధికారులు, పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వస్తున్న భక్తులు, ఆంజనేయస్వామి మాల ధరించి వస్తున్న స్వాములు పడుతున్న ఇబ్బందులను చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో టీటీడీ ధార్మిక మండపాల నిర్మాణాల నిమిత్తం వెచ్చిస్తున్న నిధుల నుంచి రూ.35.19 కోట్లను కొండగట్టు ఆలయంలో సత్రం, దీక్షల విరమణ మండపాలను నిర్మించేలా కేటాయించింది. ఈ నిధులతో మొత్తం 96 గదుల వసతి సముదాయం, 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా అతి పెద్ద మండపం అందుబాటులోకి రానున్నాయి. ఈ పనులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం శంకుస్థాపన చేశారు. అంతకు ముందు వేదపండితులు శాస్త్రోక్తంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం చేయించారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కొండగట్టు స్థానం ఎంత శక్తిమంతమైందంటే తెలంగాణకు పూర్తిస్థాయి రక్షణ, బలంగా మారుతుంది. కొండగట్టు గిరి ప్రదక్షిణకు ప్రయత్నం మొదలుపెట్టండి. నేను స్వయంగా వచ్చి కరసేవ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. అంతా సమష్టిగా స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి.  

చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం గారు 2008 నుంచి నాకు తెలుసు. ఉస్మానియాలో ఎన్ఎస్ యూ నాయకుడిగా ఉన్నపుడు, నాతోపాటు కలిసి పనిచేసే వారు. తెలంగాణ ప్రజలు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. నాకు పునర్జన్మనిచ్చిన కొండగట్టు అంజన్నస్వామి వారి దివ్య అనుగ్రహానికి ప్రత్యక్ష సాక్షి సత్యం గారు. 

నేను గతంలో కొండగట్టు సందర్శించినపుడు అర్చకులు అప్పట్లో సత్రం కావాలని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉన్నాం. ఈ అభివృద్ధి పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నాను. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి టీటీడీ బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉంది.’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యార్, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీ హరీష్, జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్, టీటీడీ బోర్టు మెంబర్లు శ్రీ ఆనందసాయి, శ్రీ మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ శ్రీ శంకర్ గౌడ్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

 

#Kondagattu #Telangana

Visited 32 times, 1 visit(s) today
Share.
Leave A Reply

Uploading your documents

Please do not close or refresh this window.
This may take a few seconds.

Exit mobile version