మారుతున్న సవాళ్లకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి: ఖమ్మం సీపీ సునీల్ దత్
ఖమ్మం, జూన్ 16: మారుతున్న పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పోలీసింగ్‌పై అధికారులు దృష్టి సారించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు.
ఖమ్మం రూరల్ డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశం మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ నేరాల నియంత్రణపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు. విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన వంటి ప్రతికూల ధోరణులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంటల సాగు కోసం విత్తనాలు కొనుగోలు చేస్తున్నారని, నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోకుండా వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు జరిగే ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా సరిహద్దుల్లో విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేసి, చెక్‌పోస్టుల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా లేదా అక్రమ నిల్వలు గుర్తించిన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకుని, అవసరమైన చోట జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటిని హాట్‌స్పాట్లుగా పరిగణించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు అమలు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.