ఖమ్మం జిల్లా, కొణిజర్ల: కొణిజర్ల పోలీసులు సుమారు రూ.1 కోటి విలువైన 201.45 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సూరజ్ తెలిపారు.
వైరా ఏసీపీ సారంగపాణి ఆదేశాల మేరకు కొణిజర్ల పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వైరా నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఒక బొలెరో వాహనం మరియు దానికి పైలెట్‌గా వెళ్తున్న ఒక కారు అనుమానాస్పదంగా కనిపించాయని పోలీసులు తెలిపారు.
వాహనాలను తనిఖీ చేయగా వాటిలో ఎండు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుల వద్ద నుంచి 201.45 కిలోల ఎండు గంజాయి, ఏడు మొబైల్ ఫోన్లు, నగదు, ఒక కారు మరియు ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,00,50,000గా అంచనా వేస్తున్నారు.
అరెస్ట్ చేసిన వ్యక్తులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన సరఫరాదారులు మరియు ఇతర సంబంధిత వ్యక్తుల కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.