పాడ్యమి పర్వదినం సందర్భంగా వైభవంగా శ్రీ సూర్య ధన్వంతరి స్వామివారి ప్రత్యేక పూజలు
జగిత్యాల, మే 17:
వైశాఖ మాస శుక్ల పక్ష పాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో శ్రీ ఉషా చాయ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకం, ప్రత్యేక పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆదివారం సూర్య భగవానునికి అంకితమైన పవిత్ర దినంగా భావిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించగా భక్తులు భక్తి పారవశ్యంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా భక్తులకు ఉచిత అమృత నిర్గుండి కషాయం పంపిణీ చేశారు. అనంతరం భక్తులు స్వామివారికి ముడుపులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సూర్య భగవానుని ఆరాధన వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, విజయాలు, ఐశ్వర్యం కలుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండర్ & చైర్మన్ డాక్టర్ వడ్లగట్ట రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒడ్నాల శ్రీనివాస్, సహాయ కోశాధికారి వడ్లగట్ట గోపి, సహాయ కార్యదర్శి భారతాల రాజసాగర్, చెన్నూరి శ్రీధర్, ఎలిమెళ్ల సత్యనారాయణ, వేముల రాజేష్, యాంసాని శంకరయ్య, నాగరాజు, భీంరావ్, అర్చకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
సూర్య మంత్రం:
ఓం సూర్యాయ నమః
రిపోర్టర్ సురేష్ సుంచు