May 11, 2026

కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

950 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

జగిత్యాల:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు.

కొండగట్టు జేఎన్‌టీయూ కళాశాలలో నిర్వహించిన పోలీసు బ్రీఫింగ్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. జయంతి ఉత్సవాల సందర్భంగా 950 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భద్రతా ఏర్పాట్లను 6 సెక్టార్లుగా విభజించి, మూడు షిఫ్టుల విధానంలో సిబ్బందికి విధులు కేటాయించినట్లు తెలిపారు.

జయంతి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు పోలీసులు ఓపికతో సలహాలు, సూచనలు అందిస్తూ సేవాభావంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. దేవస్థానం పరిసరాలు, మాల విరమణ ప్రాంతాలు, క్యూ లైన్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 24 గంటలపాటు పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు.

పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ఈ సంవత్సరం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించామని, రాత్రి వేళల్లో ప్రమాదాలు నివారించేందుకు స్టాపర్లు, కోన్స్, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కాలినడకన వచ్చే భక్తులకు సూచనలు

హనుమాన్ దీక్ష తీసుకుని కాలినడకన కొండగట్టుకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా వారి బ్యాగులు, జెండాలకు రేడియం స్టిక్కర్లు అంటించడం జరిగిందన్నారు. రహదారులపై నడిచేటప్పుడు వాహనాలను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని భక్తులకు సూచించారు.

ప్రతి భక్తుడు ప్రశాంతమైన వాతావరణంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని సురక్షితంగా తిరిగి వెళ్లేలా ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.

SUNCHU SURESH

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION