June 21, 2026

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

తేదీ: 20-06-2026 | శేరిలింగంపల్లి, చందానగర్:
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సఫారీ నగర్, కొత్తగూడలోని న్యూ బ్లూమ్ హై స్కూల్‌లో యోగా అవగాహన మరియు సాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ యోగా గురువు శ్రీ వి. రామారావు విద్యార్థులు మరియు పాల్గొన్న వారికి యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యాన సాధనలను నేర్పించారు. ముఖ్యంగా విద్యార్థులలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఆసనాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సమగ్ర జీవన విధానమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించేందుకు ఐక్యరాజ్యసమితి 2015 నుండి ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ ఏడాది యోగా దినోత్సవం ప్రధాన అంశం “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా (Yoga for Healthy Ageing)” అని వివరించారు.

యోగా సాధన ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ మరియు సామాజిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. యోగాలో ప్రధానంగా యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం అనే మూడు అంశాలు ఉంటాయని చెప్పారు. క్రమబద్ధమైన యోగా సాధన వల్ల కండరాలు బలపడటం, రక్తప్రసరణ మెరుగుపడటం, శరీర సౌష్టవం పెరగటం, అలసట తగ్గటం, శక్తి స్థాయిలు పెరగటం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.

అలాగే ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో యోగా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి సమతుల ఆహారం, తగిన నీటి సేవనం, శారీరక చలనం, సరైన విశ్రాంతి మరియు సానుకూల ఆలోచనలు అవసరమని సూచించారు.

ధూమపానం, మద్యపానం మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

యోగశాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి పతంజలి సేవలను స్మరించుకుంటూ, యోగా ద్వారా శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక వికాసం సాధ్యమని పేర్కొన్నారు.

“వ్యాధి లేని శరీరం – వేదన లేని మనస్సు” అనే లక్ష్యాన్ని సాధించడానికి యోగా ఒక అద్భుత మార్గమని తెలిపారు.

నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ కుల, మత, ప్రాంత, లింగ భేదాలకు అతీతంగా యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కిరణ్, యోగా ట్రైనర్ లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీ గంగల గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం
“యోగం ఆరోగ్యానికి మార్గం – ఆరోగ్యమే ఆనందమయ జీవితానికి పునాది” అనే సందేశంతో విజయవంతంగా ముగిసింది.

Written by

NANDURI VENKATESWARLU

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION