“బాధితులకు సౌకర్యంగా – ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు”
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు తెలియజేయునది ఏమనగా, బాధితులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ “ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు” సేవలను అమలు చేస్తోంది.
ఈ సేవ ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు పోలీస్ స్టేషన్‌కు స్వయంగా రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ వంటి ఆస్తి సంబంధిత నేరాలు, అలాగే పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహ నిరోధక చట్టాల పరిధిలోని కేసులలో బాధితులు ఫోన్ ద్వారా సమాచారం అందించిన యెడల, వెంటనే పోలీసులు బాధితుల నివాసం లేదా వారికి అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారు.
ఫిర్యాదుదారు స్వయంగా రాయలేని పరిస్థితుల్లో, పోలీసు అధికారులు బాధితుని వాంగ్మూలాన్ని వారి భాషలో నమోదు చేసి చదివి వినిపించి, వారి సమ్మతితో సంతకం తీసుకుంటారు. అనంతరం అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దాని ప్రతిని బాధితునికి అందజేస్తారు.
మహిళలు మరియు పిల్లల కేసులలో మహిళా పోలీసు అధికారిని తప్పనిసరిగా పంపిస్తారు. అవసరమైతే ఇంటర్‌ప్రెటర్ లేదా ప్రత్యేక ఉపాధ్యాయుల సహకారంతో వాంగ్మూలం నమోదు చేయబడుతుంది. అదేవిధంగా, సంఘటన స్థలాన్ని రక్షించడం మరియు సాక్ష్యాల సేకరణ వంటి చర్యలు వెంటనే చేపడతారు.
ఈ విధానం ద్వారా ఫిర్యాదు నమోదు ప్రక్రియ వేగవంతం అవుతుంది మరియు బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరం తగ్గుతుంది.
జిల్లా ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని నేరాలను నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరడమైనది. మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తున్నది.
#MahabubnagarPolice