ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్- అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమం........
ది 16-09-2026 శేర్లింగంపల్లి చందానగర్ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ఓజోన్ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ *తాడిబోయిన రామస్వామి యాదవ్* ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు *శ్రీమతి పి. అనుపమ* అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఆచార్య జి. కిషోర్ కుమార్* , సెంటర్ ఫర్ ఎర్త్, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆచార్య కిషోర్ కుమార్ మాట్లాడుతూ, *సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాలను శోషించడంలో స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తుందని* , తద్వారా మానవులు, జంతువులు, మొక్కలు సహా భూమిపై ఉన్న జీవరాశులకు ఇది సహజ రక్షణ కవచంగా పనిచేస్తుందని తెలిపారు.
ఓజోన్ పొరలో ఏర్పడుతున్న మార్పులు, ముఖ్యంగా అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ క్షీణతను శాస్త్రవేత్తలు గుర్తించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఓజోన్ పొరను రక్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాయని వివరించారు. *క్లోరోఫ్లోరోకార్బన్లు (CFCs), హాలాన్లు మరియు ఇతర ఓజోన్-క్షీణక రసాయనాల వినియోగాన్ని నియంత్రించేందుకు 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ కుదిరిందని* చెప్పారు.
ఐక్యరాజ్యసమితి 1994లో సెప్టెంబర్ 16ను *అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా* ప్రకటించిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
*“శీతలమైన భూగ్రహం కోసం ప్రపంచవ్యాప్త కార్యాచరణ – కిగాలి సవరణ కింద స్థిరమైన శీతలీకరణకు 10 ఏళ్ల ప్రస్థానం”* అనే ఈ సంవత్సరం సందేశం ద్వారా ఓజోన్ పరిరక్షణతో పాటు పర్యావరణహిత శీతలీకరణ సాంకేతికతల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఓజోన్ ప్రధానంగా వాతావరణంలోని *స్ట్రాటోస్ఫియర్‌లో, భూమి ఉపరితలం నుంచి సుమారు 15–35 కిలోమీటర్ల ఎత్తులో* అధిక సాంద్రతతో ఉంటుంది. ఈ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన UV-B కిరణాలలో గణనీయమైన భాగాన్ని గ్రహించి భూమిపై జీవరాశులను రక్షిస్తుంది. మరోవైపు, భూమికి సమీపంలోని *ట్రోపోస్ఫియర్‌లో అధికంగా ఉండే ఓజోన్ ఒక వాయు కాలుష్యకారకంగా* మారి మానవ ఆరోగ్యం, పంటలు మరియు పర్యావరణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.
ఓజోన్ పరిరక్షణతో పాటు వాతావరణ మార్పులను నియంత్రించేందుకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆచార్య కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. *అడవుల నరికివేతను అరికట్టడం, మొక్కలు మరియు చెట్లను పెంచడం, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం, ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించడం, ప్రజా రవాణాను ప్రోత్సహించడం, పర్యావరణహిత ఉత్పత్తులను వినియోగించడం* వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
శీతలీకరణ పరికరాల వినియోగంలో *ఓజోన్-క్షీణక పదార్థాలు మరియు అధిక గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ కలిగిన శీతలీకరణ వాయువుల స్థానంలో పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని* తెలిపారు. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు వంటి పరికరాలను అవసరానికి అనుగుణంగా, శక్తి సామర్థ్యంతో ఉపయోగించాలని సూచించారు.
అలాగే, *Reduce, Reuse, Recycle (3R)* సూత్రాన్ని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో పాటించాలని, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగించగల సంచులను ఉపయోగించాలని కోరారు.
“*ఓజోన్ పొరను మనం రక్షిస్తే, అది మనలను రక్షిస్తుంది. ఓజోన్ పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు; ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత*” అని ఆచార్య కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు మరియు పౌర సమాజం సమష్టిగా కృషి చేసినప్పుడే పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించగలమని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో *ఓజోన్ పరిరక్షణ ప్రతిజ్ఞ* చేయించారు. ఓజోన్ పొరను కాపాడేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినులు అనిత, సరిత ఉపాధ్యాయుడు శ్రీకాంత్, విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు *అమ్మయ్య చౌదరి, బాలన్న* తదితరులు పాల్గొన్నారు.