మహిళలు, చిన్నారులతో కలిసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్‌ఫ్లై పార్కులో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ తదితర స్వదేశీ జాతి విత్తనాలతో ఈ విత్తన బంతులను రూపొందించారు.
రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో సీడ్ బాల్స్ తయారీ
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం నిర్వహించారు. మూలపాడు బటర్‌ఫ్లై పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
సీడ్ బాల్స్ తయారీలో పాల్గొన్న ప్రజలతో మాట్లాడి, ఉపయోగిస్తున్న విత్తనాల రకాలు, తయారీ పరిమాణం తదితర వివరాలను తెలుసుకున్నారు. వన సంరక్షణ కోసం కృషి చేసిన మహనీయుల స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
సీడ్ బాల్స్ ప్రాముఖ్యతను వివరించిన చిన్నారులను అభినందించిన ఆయన, జూన్ 15 నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో విత్తన బంతులు వెదజల్లే ప్రక్రియను పరిశీలించారు.
ప్రతి ఎకో పార్కులో యోగా హాల్ ఏర్పాటు
కార్యక్రమానికి ముందు బటర్‌ఫ్లై పార్కులో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్‌ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. పార్కు నమూనాలో భాగంగా ఏర్పాటు చేసిన యోగా హాల్ ఆయనను ఆకట్టుకుంది.
ప్రతి ఎకో టూరిజం పార్కులో యోగా హాల్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కొయ్య బొమ్మలు, కళాకృతుల ప్రోత్సాహానికి హామీ
అనంతరం కొండపల్లి కొయ్య బొమ్మల తయారీలో ఉపయోగించే తెల్లపొణికి దుంగలను పరిశీలించారు. అలాగే కొండపల్లి బొమ్మలు, ఉదయగిరి కళాకారులు రూపొందించిన వివిధ చెక్క కళాకృతులు, గృహోపకరణాలను ఆసక్తిగా వీక్షించారు.
కళాకారులు బొమ్మల తయారీకి అవసరమైన చెక్క కొరత గురించి వివరించగా, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక కళారూపాలకు మార్కెటింగ్, ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
చేతివృత్తుల కళాకారులతో ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, అటవీ మరియు పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ్ తదితరులు పాల్గొన్నారు.