ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జిల్లా లో వరి ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం ధర్మపురి మండలంలోని జైన, రాజారం గ్రామాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, దుబ్బలగూడెం గ్రామంలోని మొక్కజొన్న గోదాం, దమ్మన్నపేట గ్రామంలోని పరమేశ్వర రైస్ మిల్ మరియు ధనలక్ష్మి రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాల పరిస్థితులు ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని సంచులు, టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉంచి ధాన్యం తడవకుండా రక్షించాలని సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డాటా ఎంట్రీని వెంటనే పూర్తి చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అలాగే మిల్లుల వద్ద ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి లారీలను త్వరగా పంపించేలా మిల్లర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మిల్లుల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం, మిల్లింగ్ సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిల్లర్లు హమాలీలను అందుబాటులో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఆలస్యం లేకుండా దింపుకోవాలని సూచించారు.
మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లు మరియు అధికారులు పరస్పర సమన్వయంతో ధాన్యం రవాణా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, సివిల్ సప్లైస్ డీఎం జితేంద్ర ప్రసాద్, తహసీల్దార్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.